ప్రకాశం, పర్చూరు: ఇద్దరూ ఆడ బిడ్డలే.. అయితేనేం ఆ తండ్రి వారిని రెండు కళ్లనుకున్నారు. ఏ బిడ్డకు చిన్న కష్టమొచ్చినా తట్టుకునే వాడు కాదు. చిన్న తనంలో ఆడుకుంటూ బిడ్డలకు ఎదురుదెబ్బ తగిలితే ఆయన విలవిల్లాడిపోయేవారు. ‘హనుమంతురావు ఇద్దరూ ఆడపిల్లలే కదరా..అని ఎవరైనా అంటే’..అయితేనేం రా..అంటూ గట్టిగా సమాధానం చెప్పేవారు. ఇలా తండ్రి ప్రేమను నిండుగా కలిగిన ఆ కుమార్తెలు.. పెరిగేకొద్దీ ఆయన ఆకాంక్షలు గుర్తించారు. నాన్న కలలను రూపమిస్తూ ఇద్దరూ విద్యావంతులై ఆయన కళ్లలో ఆనందబాష్పాలు నింపారు. వృద్ధాప్యంలోకి వెళ్లిన ఆ తండ్రి ఊపిరి సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు అర్ధంతరంగా ఆగిపోయింది. కర్మకాండలు పూర్తి చేయాలంటే వారసుడు లేరే అంటూ బంధువులు నసుగుతున్నారు. ఆ సమయంలో తండ్రిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కన్న బిడ్డలిద్దరూ ముందుకొచ్చారు. తండ్రికి తామే అంత్యక్రియలు చేస్తామంటూ నడుం కట్టారు.
కుమార్తెలే..కుమారులై!